తెలంగాణాలో ఒకవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నా అనుకున్న విధంగా బీజేపీ బలపడకపోవటంపై టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీని బలోపేతం చేసే విషయమై సూచనలు, సలహాలు, అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించేందుకు మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో చర్చించబోయే అంశాలు ఎలాగున్నా పార్టీ అయితే అనుకున్నంతగా బలపడలేదన్నది వాస్తవం. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇతర పార్టీల నుండి నేతలు పోలోమంటు బీజేపీలో చేరిపోతారని ఆశించిన నాయకత్వానికి నిరాసే ఎదురవుతోంది. దీంతో చాలామందికి బీజేపీది వాపా లేకపోతే బలుపా అనేది అర్దంకావటంలేదు.
అప్పుడెప్పుడో కాంగ్రెస్ లో నుండి కొందర సీనియర్లు బీజేపీలో చేరటం తప్ప మళ్ళీ పెద్దగా ఎవరూ చేరలేదు. ఆమధ్య కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరి ఉపఎన్నికను తెచ్చి ఓడిపోయారు. మళ్ళీ ఇపుడు మరో సీనియర్ నేత మర్రి శశిధరరెడ్డి చేరబోతున్నారంతే. మర్రి చేరికవల్ల బీజేపీకి పెద్దగా ఉపయోగం లేకపోయినా కాంగ్రెస్ సీనియర్ నేత చేరుతున్నారని చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తుందంతే.
నిజానికి బీజేపీ దృష్టంతా కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్ నేతలపైనే ఎక్కువగా పెట్టింది. టీఆర్ఎస్ సీనియర్ నేతల్లో ఎంతమందిని వీలైతే అంతమందిని చేర్చుకుని కేసీయార్ ను మానసికంగా దెబ్బకొట్టాలన్నది కమలనాదులు వ్యూహం. అయితే కేసీయార్ ముందు బీజేపీ పప్పులుడకటంలేదు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తప్ప ఇంకెవరూ చేరలేదు. ఉపఎన్నికల్లోగానే 8 మంది టీఆర్ఎస్ ఎంఎల్ఏలు బీజేపీలో చేరబోతున్నారనే దుబ్బాక ఎంఎల్ఏ రఘునందనరావు ప్రకటన బూమరాంగ్ అయ్యింది. దానికితోడు మునుగోడులో బీజేపీ ఓడిపోవటంతో ఇప్పటివరకు ఎవరూ ఈ పార్టీవైపు చూడలేదు.
రేపటి కార్యవర్గ సమావేశంలో ఇలాంటి అనేక అంశాలపై చర్చలు జరగబోతున్నాయి. ఇతర పార్టీల నుండి చేరికలపైన కూడా చర్చ ఉంటుందని సమాచారం. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇతర పార్టీల నుండి నేతలు బీజేపీలో చేరకపోతే సమస్యగా మారుతుందని పార్టీ అగ్రనేతలు టెన్షన్ పడుతున్నారు. ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలు చేరకపోతే రేపటి ఎన్నికల్లో పోటీచేసే విషయంలో కూడా ఇబ్బందులు తప్పవనేది అసలు సమస్య. పోటీకే అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు దొరక్కపోతే ఇక గెలుపు ఎక్కడిది ? అధికారంలోకి ఎలాగ వస్తుంది ? రాబోయే ఎన్నికలతో అయినా బీజేపీది వాపా లేకపోతే బలుపా అనేది తేలుతుందేమో చూడాలి.