మొన్ననే జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడినుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచింది కూసుకుంట్ల ప్రభాకర రెడ్డే అయినా నిజానికి ఇక్కడ గెలిచింది కేసీయార్ అనే అనుకోవాలి. ఎందుకంటే మునుగోడు ఉపఎన్నికలో పార్టీ గెలుపును కేసీయార్ అంత ప్రిస్టేజిగా తీసుకున్నారు. నానా అవస్తలుపడి ఇక్కడ గెలిచినా ఫలితమైతే కేసీయార్ కు డేంజర్ బెల్స్ మోగించినట్లే అనుకోవాలి.
ఫలితంపై పార్టీలో బాగా విశ్లేషణలు జరిగాయి. ఆ విశ్లేషణల్లో బయటపడిన అంశాలను చూసిన తర్వాత కేసీయార్ వచ్చేఎన్నికల విషయంలో తప్పకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని అర్దమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 2,12,765 మందికి ప్రభుత్వం నుండి ఏదో రూపంలో కనీసం ఒక పథకమన్నా అందుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 43 వేలమందకి ఆసరా, 5,765 మంది యాదవులకు కులపరమైన స్వయంఉపాధి యూనిట్లు, 9 వేలమందికి కల్యాణ్ లక్ష్మి లబ్ది అందింది.
ఇదికాకుండా మరో 1.13 లక్షలమందికి రైతుబంధు సాయం అందుకున్నారు. మరో 42 వేలమంది ఉచిత కరెంటు అందుకుంటున్నారు. రెండులక్షలమందకి పైగా ఇన్ని రకాలుగా లబ్ది అందుకున్న తర్వాత కూడా ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు వచ్చింది 97 వేల ఓట్లే. 2018 ఎన్నికల్లో ఇదే కూసుకుంట్లకు వచ్చింది 74 వేల ఓట్లు. అంటే అప్పటికి ఇప్పటికి అదనంగా వచ్చింది 23 వేల ఓట్లు మాత్రమే.
అదికూడా మొత్తం మంత్రివర్గాన్ని, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు, నేతలందరినీ మోహరించిన తర్వాత, అధికారయంత్రాంగమంతా కంట్రోల్లో పెట్టుకుని నానా అవస్తలు పడితే కానీ టీఆర్ఎస్ గెలవలేదు. మరి వచ్చేఎన్నికల్లో కేసీయార్ మునుగోడులో చేసినట్లే అన్నీ నియోజకవర్గాల్లోను ఎలక్షనీరింగ్ చేయగలరా ? కచ్చితంగా సాధ్యంకాదు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే మరప్పుడు ఏమిచేయాలి ? ఆ విషయంపైనే కేసీయార్ సీరియస్ గా కసరత్తు చేయకపోతే కచ్చితంగా ఇబ్బందులో పడటం ఖాయం. మునుగోడులో పార్టీకి 1.5 లక్షల ఓట్లు వస్తాయని అనుకుంటే వచ్చింది లక్షలోపే. దీంతోనే అర్ధమవుతోంది వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం మునుగోడు కాదని. మరపుడు కేసీయార్ ఏమిచేస్తారో చూడాల్సిందే.