ఓటీటిలు వచ్చాక తెలుగు జనాలకు బాగా థ్రిల్లర్ జానర్ కు అలవాటు పడిపోయారు. ఆ సినిమా ఫార్మెట్ వారికి కంటస్దమైపోయింది. ఏ సీన్ తర్వాత ఏమి వస్తుందో చెప్పేయగలుగుతున్నారు. డైరక్టర్ ఎంతో కష్టపడి..ఎన్నో కేసులు రిఫర్ చేసి, ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసి రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్ లో హంతకుడు ఎవరో ఇట్టే కనిపెట్టేస్తున్నారు. దాంతో ఓ మాదిరి థ్రిల్లర్స్ తో తెలుగు ప్రేక్షకుడుని అలరించి థ్రిల్ చేయటం కష్టం…ఏదో ఒక కొత్తదనం లేకపోతే ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలో ‘హిట్’తో హిట్ కొట్టి సీక్వెల్ కు తెరఎత్తాడు శైలేష్ కొలను,హీరో నాని. ఈ సినిమాని ఓ మాదిరిగా గెస్ చేయచ్చు. కిల్లర్ ఎవరో తెలిసిపోతూంటుంది. మనకు తెలుస్తుందనే విషయం డైరక్టర్ కు తెలియదంతే. దాంతో ఓ పెద్ద సస్పెన్స్ సినిమాలా సీన్స్ వేసుకుంటూ వెళ్తే..ఆ పజిల్ ని వెనకాలే విప్పుకుంటూ మనం వెళతాం. అఫ్ కోర్స్ ఇదీ ఓ రకమైన ఇన్విస్టిగేషనే అనుకోండి.

అయితే ఇలా పెదవి విరిచేస్తారనే డైరక్టర్ తెలివిగా రన్ టైమ్ తక్కువ పెట్టాడు. అయితే ఆ రెండు గంటలు అయినా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెడతాడు అనుకుంటే కొంతవరకే సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ జానర్ సినిమాల్లో విలన్ ..ఉండే ప్లాష్ బ్యాక్ కు ప్రయారిటీ ఎక్కువ ఇస్తూంటారు. అదీ ఇంట్రస్టింగ్ గా చెప్పటానికి డైరక్టర్స్ ట్రై చేస్తూంటారు. అయితే ఇందులో అదే డ్రై అయ్యిపోయింది.ఓ మిడిల్ క్లాస్ కుర్రోడు సీరియల్ కిల్లర్ గా మారిన వైనాన్ని చాలా లైటర్ వీన్ లో ప్లాష్ బ్యాక్ గా చూపడం నిరాశకు గురిచేస్తుంది. తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటనని గుర్తు పెట్టుకుని, ఓ వర్గాన్ని పనికట్టుకుని టార్గెట్ చేయడంలో సినిమాలో హై రావాల్సిన చోట రాకుండా పోయింది. అఫ్ కోర్స్ అదే మెయిన్ కథ కాదు కాబట్టి ఛల్తాహై..ఇంతకీ ఈ సీక్వెల్ సినిమాలో ఎత్తుకున్న కథాంశం ఏమిటి అంటే…
వైజాగ్ యస్పీ కృష్ణదేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్ ) కాస్త స్పీడున్నోడే. నోటి దురద ఉన్నోడే. క్రిమినల్స్వి కోడి బుర్రలనీ, వాళ్లని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మీడియా సాక్షిగా స్టేట్మంట్ ఇస్తారు. అయితే ఓ క్రిమినల్ దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. సిటీలో ఓ పబ్లో పనిచేసే ఓ అమ్మాయి దారుణ హత్యకి గురవుతుంది. చేతులు, కాళ్లూ, మొండెం అన్నీ వేరు చేసి.. దారుణ స్థితిలో ఉన్న ఆ అమ్మాయి మృతదేహాన్ని చూసిన కేడీకి.. ఇన్విస్టిగేషన్ మొదలెడతారు. అందులో ఓ షాకిచ్చే నిజం తెలుస్తుంది. ఆ కాళ్లూ చేతులు, మొండెం ఒకరివి కాదని.. మొత్తం నలుగురు అమ్మాయిలు హత్యకి గురయ్యారనేది అర్దమవుతుంది. అమ్మాయి మెడపై ఉన్న పంటిగాటు తప్ప మరే ఆధారం లేకుండా హత్యలు చేస్తున్న ఆ కిల్లర్ ఎవరు? అనే దిసగా విచారణ ముమ్మరం చేస్తాడు. ఇంతకీ ఎవరా సైకో కిల్లర్… అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? కేడీ ..ఆ కిల్లర్ ఎవరో పట్టుకోగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా అడవి శేషు వన్ మ్యాన్ షో. కానీ డైరక్టర్ మిగతా పాత్రలకి ప్రయారిటీ ఇచ్చి ఉండాల్సింది. హీరోయిన్ పాత్ర ఉందంటే ఉంది లేదంటే లేదు.అన్నట్లు డిజైన్ చేసారు. పోసాని, తణికెళ్ల వంటి సీనియర్స్ ఎప్పటిలాగే చేసుకుంటూ వెళ్లారు. టెక్నికల్ గా ఈ సినిమా బాగా సౌండ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ఇట్చారు. నిర్మాణం బాగుంది. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి.
చూడచ్చా
ఎక్సపెక్టేషన్స్ లేకుండా చూస్తే సినిమా నచ్చుతుంది, ఫస్ట్ పార్ట్ స్దాయిలో ఊహించుకోవద్దు.
నటీనటులు : అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు
ఛాయాగ్రహణం : మణి కందన్ ఎస్
నేపథ్య సంగీతం : జాన్ స్టీవార్ట్ ఏడూరి
స్వరాలు : ఎం.ఎం. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
సమర్పణ : నాని
నిర్మాత : ప్రశాంతి త్రిపిర్నేని
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022
Rating:2.5