సమాజం, సందేశాలు, మంచిని నేర్పే పాటలు, పాఠాలు.. చివర్లో ఉపన్యాసాలు ఇవన్నీ కాలం చెల్లిన వ్యవహారాలు. థియేటర్ కు అడపదడపా వెళ్లే జనాలను సైతం ఇవి అడ్డుకుంటున్నాయి. ఓ మంచి సినిమాని టీమ్ గొప్పలు చెప్పుకుంటూ చివరకు బొప్పి కొట్టింది అని బావురుమనటం తప్ప చేయగలిగిందేం లేదు. అల్లరి నరేష్ కు నటుడుగా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. కామెడీని పూర్తిగా వదిలేయాలని ఉంది. ఆ రెంటిలో తప్పేమీ లేదు. అయితే ఆ క్రమంలో తన బలాలను, తను ఇన్నాళ్లు పోగు చేసుకున్న అభిమానులను కూడా వదిలేయాల్సి రావటం విషాదం. మహర్షి చిత్రంతో తనలోని నటుడుని పరిచయం చేద్దామని డిఫెరెంట్ రోల్ చేసాడు. బాగా చేసాడని అనిపించుకున్నాడు. అయితే అది అల్లరి నరేష్ మాత్రమే చెయ్యగలడు అని మాత్రం అనిపించుకోలేకపోయాడు. తర్వాత వచ్చిన నాంది అతని నటనోత్సాహానికి ఊపు ఇచ్చింది. సినిమా హిట్టై.. ఇలాంటి సామాజిక అంశాలు చుట్టూ తిరిగే కథలను ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చింది. అందులోంచి వచ్చిందే ఈ చిత్రం. ఓ తెలుగు మాస్టారు.. ఎలక్షన్ డ్యూటీకు వెళ్లటం.. అక్కడ ఉండే జనాల బాధలను చూసి బాధపడిపోయి.. వారికి సహాయం చేయటం ఇందులో కథాంశం. అయితే ఇందులో మాస్టారు పాత్రలో అల్లరి నరేష్ పడే పెయిన్ ఏముంది.. చుట్టూ ఉన్న జనాలను చూసి బాధపడటం తప్ప. నాందిలో నరేష్ పర్శనల్ పెయిన్ ఉంది కాబట్టే జనం అతని పాత్రకు సహాయానుభూతి చూపించి, సినిమాని హిట్ చేసారు. ఇక్కడ హీరో ఎక్కడా సమస్యలో పడడు. అదే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే పరంగా పెద్ద సమస్య. అదే జనాలకు బోర్ కొట్టించింది.. నరేష్ సినిమా అని ఉత్సాహపడ్డ వాళ్లకు నరకం చూపించింది. ఇంతకీ కథ ఏమిటంటే..
గవర్నమెంట్ తెలుగు టీచర్ శ్రీపాద శ్రీనివాస్ (అల్లరి నరేష్) ఓ మంచి మనిషి. ఎన్నికల డ్యూటీ నిమిత్తం రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి వెళతాడు.
అక్కడ జనాలు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో విసిగిపోయి ఉంటారు. పురిటి నొప్పులు పడుతున్న మహిళలను ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలంటే నది దాటాలి. చదువు సంధ్యలకు ఇబ్బంది పడుతూంటారు. దాంతో రోడ్డు, స్కూల్, హాస్పటల్ వంటి కనీస వసతి సౌకర్యాలు లేని ఆ ప్రాంతం ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తారు. కానీ అక్కడ శ్రీనివాస్ చేసిన సాయం, మంచితనం చూసి ఓట్లు వేయాటనికి ముందుకు వస్తారు. గ్రామంలో ఉండే లక్ష్మి (ఆనంది) అతనికి అండగా నిలబడుతుంది. ఎన్నికల పూర్తి తర్వాత ఓటింగ్ మిషన్స్‌తో వెళుతున్న శ్రీనివాస్ అండ్ టీమ్‌ని గ్రామస్థులు తమలో ఒకడైన కండా (శ్రీతేజ) సాయంతో కిడ్నాప్ చేస్తారు. అసలు కండా ఎందుకు శ్రీనివాస్‌ని కిడ్నాప్ చేస్తాడు? అసలు వారికి కిడ్నాప్ ఆలోచన ఎలా వచ్చింది? కలెక్టర్ (సంపత్ రాజ్) సహా ప్రభుత్వం మారేడుమిల్లి సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కిడ్నాప్ అయిన అధికారులను విడిపించడానికి ప్రభుత్వం ఏం చేసింది? చివరకు ఏం అయ్యింది? లక్ష్మి (ఆనంది) ఎవరు? అనేది మిగతా సినిమా. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

టెక్నికల్ గా చూస్తే… మొదట ఈ సినిమా కథే బోరింగ్ గా, రొటీన్ గా అనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలని బాగా తెరపై చూపించాడు. ఇలాంటివన్నీ పేపర్లో, టీవీల్లో చాలా సార్లు చూసినవే. అలాగే సీరియస్ స్టోరీలో కాస్త కామెడీ ఉన్నా.. కలిసి రాలేదు. దాంతో మిగతా డిపార్టమెంట్ లు ఎంత కష్టపడినా వాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. ఎడిటింగ్ లోపం ల్యాగ్ అనిపిస్తుంది.
నటీనటుల్లో.. అల్లరి నరేశ్ ఎలక్షన్ అధికారిగా తన విధిని బాధ్యతగా నిర్వహించే పాత్రలో చక్కగా నటించాడు. కానీ ప్రత్యేకత అయితే ఏమీ లేదు. ఇక హీరోయిన్ గా నటించిన ఆనంది తన పాత్రకు న్యాయం చేసింది. అయితే గిరిజన యువతిగా… మాములుగా కనిపించడం చిత్రంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఇంగ్లీష్ టీచర్ పాత్రలో తన క్యారెక్టర్ లో బాగా చేశాడు. గిరిజన నాయకుడిగా నటించిన శ్రీతేజ్, కలెక్టర్ గా సంపత్ రాజ్, ఊరి ప్రజల నుంచి తక్కువ రేటుకే సరుకులు కొనే వ్యాపారి పాత్రలో రఘుబాబు న్యాయం చేశారు.
చూడచ్చా
సందేశాత్మక చిత్రాలు ఈ మధ్యకాలంలో బాగా మిస్సవుతున్నాం అని ఫీలయ్యేవారు ఓ లుక్కేయచ్చు
నటీనటులు : ‘అల్లరి’ నరేష్, ఆనంది, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీతేజ్, కామాక్షి భాస్కర్ల, కుమనన్ సేతురామన్ తదితరులు
మాటలు : అబ్బూరి రవి
ఛాయాగ్రహణం : రామ్ రెడ్డి
సంగీతం : శ్రీచరణ్ పాకాల
నిర్మాణ సంస్థలు: హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాత : రాజేష్ దండా
రచన, దర్శకత్వం : ఏఆర్ మోహన్
విడుదల తేదీ: నవంబర్ 25, 2022
రేటింగ్ : 2/5