ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న సినిమాలు అన్నింటినీ మించి నాని ‘దసరా’ సినిమాకి మంచి బజ్ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక హైప్ మరింత పెరిగింది. ఈ సినిమా నాని కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ట్రైలర్ లోని విజువల్స్ చూస్తే వీర్లపల్లి అనే చిన్న పల్లెటూరులో బొగ్గు కుప్పల నేపథ్యంలో పెరిగిన ఓ వ్యక్తి ఎదుగుదలకు సంబంధించిన తీవ్రమైన, రక్త సిక్తమైన కథలా ఈ చిత్రం కనిపిస్తుంది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరి ఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నార్త్ ఇండియా వాళ్లకు ఎక్కుతుందా లేదా అన్న విషయమై నానీ ఇలా రిప్లై ఇచ్చారు.
మా దసరా సినిమాలో దమ్ముంది, కంటెంట్ ఉంది.. కాంతారా సినిమా కేవలం వర్డ్ ఆఫ్ మౌత్ తో ఆడింది. మా సినిమాకు అలాంటి మ్యాజిక్కే జరుగుతుందని నమ్ముతున్నాను అన్నారు నాని. మరో ప్రక్క ఈ చిత్రం స్టోరీ లైన్ ఏమిటనేది ఆసక్తికరమైన విషయంలా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం చిత్రం ట్రైలర్… నాని పాత్ర, సినిమా పై కూడా ఈ ట్రైలర్ ఓ అవగాహన కల్పించింది. అతను నిర్లక్ష్యపూరితంగా ఉంటాడు, మరియు అతను ప్రతి విషయంలోనూ గొడవలు పడటం అలవాటు చేసుకున్న వ్యక్తిగా చూపించారు. మిగిలిన ట్రైలర్ చూస్తే దసరా సినిమాలో హింస ఎక్కువగా ఉంటుందని నిరూపించే షాట్స్ తో నిండి ఉంది. ట్రైలర్ చివర్లో ఎవరినో గట్టిగా కొట్టడంతో నాని నిర్భయమైన పాత్రను పోషిస్తున్నారని కూడా బలంగా సూచిస్తోంది.
ఇక ఈ చిత్రంలో హీరో, హీరో స్నేహితుడు, హీరోయిన్, విలన్ అనే నాలుగు ప్రధాన పాత్రల మధ్య దసరా కథ ముడిపడి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా హీరో స్నేహితుడి పాత్ర సినిమాకు చాలా కీలకం కానుందని, ఆయన పాత్ర చుట్టూ ఉండే ఎమోషనల్ అంశం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. కీర్తి సురేష్ పై విలన్ కన్నేస్తాడని, ఆమె కోసం పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేస్తాడని, ఆ తర్వాత నాని పెళ్లి చేసుకుంటాడని, అతన్ని చంపేయాలని చూస్తే అప్పుడు ఏమి చేసాడనేది మిగతా కథ అంటున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, రాజశేఖర్ అనింగి తదితరులు నటించారు.