ఎక్కడా ప్రక్కకు వెళ్లని, అతుకులు లేని స్క్రీన్ ప్లే, రిచ్ విజువ్స్, ట్రెడిషనల్ ముగింపు ఇవి ఏ సినిమాకైనా కలిసివచ్చే అంశాలు. తను తీసిన షార్ట్ ఫిల్మ్ ను తీసుకుని సినిమాగా చేసిన ప్రదీప్ కూడా అదే చేసారు. తను చెప్పాలనుకున్నది చెప్పాడు. చివర్లో మనం ఏమి వినాలనుకుంటున్నామో అదీ చివర్లో చెప్పాడు. అందుకే తమిళంలో అంత పెద్ద సక్సెస్ అయ్యాడు. ఈ కాలం అమ్మాయిలకు, అబ్బాయిలకు సెల్ ఫోన్ తో ఉన్న అనుబంధం.. అది వారి జీవితాలలో వారి పార్ట్ అయ్యిపోవటం. వారి సీక్రెట్స్ అదో వేదిక అవటం మరోసారి గుర్తు చేసాడు. దాంతో యూత్ కనెక్ట్ అవుతోంది. చాలా వరకూ డైలాగులు, సీన్స్ వారిని ఉద్దేశించే రాసాడు. సక్సెస్ అయ్యాడు. పనిలో పనిగా తనకు సరిపడే హీరో పాత్రను క్రియేట్ చేసుకున్నాడు. దాంతో ప్రదీప్ ఫెరఫార్మెన్స్ చాలా సహజంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన సౌతిండియన్ రాష్ట్రాల్లోని ఓ సగటు కుర్రాడు బిహేవియర్ లానే అనిపిస్తుంది. అలాగే ధనుష్ ని కూడా చాలా సార్లు తన బాడీ లాంగ్వేజ్ లో దింపేసాడు.
ధనుష్ చిరు నవ్వులు, స్టైల్స్, gestures, ఫేసియల్ ఎక్సప్రెషన్స్ ఒకటేమిటి అన్నీ మన కళ్లదెరుగా కనిపిస్తాయి. ప్రదీప్ కావాలనుకుంటే ఎవాయిడ్ చేయచ్చు. కానీ ధనుష్ ని తనలో చూసుకుంటే తన సినిమా నెక్ట్స్ లెవిల్ కు వెళ్తుందని భావించాడు. ప్రేక్షకులు తనను కొత్తవాడిగా అనుకోరనుకున్నాడు.. అదే జరిగింది. ఇవానా కూడా ఫెరఫెక్ట్ ఈ కాలం అమ్మాయిలాగే ఉంది. ప్రదీప్ కు తగ్గ జోడే అనిపిస్తుంది. మనింట్లో అమ్మాయే గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ పెయిర్ ఖచ్చితంగా మొదటి లుక్ లోనే నచ్చేస్తారు. ఇలా అన్నీ కలిసి ఈ సినిమాని మోసాయి. ఇక ప్రదీప్ అమ్మగా రాధిక, హీరోయిన్ ఇవాక తండ్రిగా సత్యరాజ్ ఫెరఫెక్ట్ ఛాయిస్. ఎమోషన్స్ సీన్స్ లో రాధిక తన కుమారుడుతో మాట్లాడేటప్పుడు మన గుండె చెమ్మగిల్లకమానదు. అలాగే ప్రదీప్ తొలిసారి సత్యరాజ్ ఇంటికివచ్చినప్పుడు జరిగే ఫన్ కు నవ్వులతో కన్నీళ్లు రాక మానవు. ఇలా ప్రతీ విషయం ఈ సినిమాకు సెట్ అయ్యాయి. ఇంతకీ ఈ చిత్రం కథేమిటంటే…

కొంతకాలంగా ప్రేమలో ఉన్న ప్రదీప్ (ప్రదీన్ రంగనాథన్), నిఖిత (ఇవానా) పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఈ లోగా వీరి ప్రేమ విషయం తెలిసిన నిఖిత తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్) ఇద్దర్నీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఓ కండీషన్ పెడతాడు. అదేమిటంటే.. వీళ్లు పెళ్లి జరగాలంటే ఒకరి ఫోన్‌ను మరొకరు ఒక్కరోజు మార్చుకోవాలని. తప్పక, వేరే దారి లేక ఓకే చేస్తారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఫోన్లో ఒకరి గురించి మరొకరికి తెలియని చాలా డార్క్ సీక్రెట్స్ ఉండటంతో అవి ఎక్కడ బయటపడతాయో అని ఇద్దరు భయపడుతుంటారు.
ఆ క్రమంలో ఈ ఫోన్ మార్పిడి వల్ల నిఖిత అంతకు ముందు మరో యువకుడిని ప్రేమించిందనే విషయం ప్రదీప్‌కు తెలుస్తుంది. అలాగే ప్రదీప్ ఇతర అమ్మాయిలతో చాటింగ్ చేయడం, అతడి బ్రేకప్ లకు సంబంధించిన అన్ని నిజాలు నిఖితకు తెలిసిపోతాయి. అలాగే నిఖిత చెల్లికి అసభ్యకరమైన మెసేజ్‌లు కూడా ప్రదీప్ యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ ఆకౌంట్ నుంచి వెళ్తూంటాయి. ఈ క్రమంలో ఫోన్ మార్చుకోవడం వల్ల ప్రదీప్, నిఖిత విడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడేం జరిగింది? అసలు ఒకరి ఫోన్‌ను మరొకరు మార్చుకోవాలని వేణుశాస్త్రి కండీషన్ ఎందుకు పెట్టాడు? చివరకు విడిపోయిన వాళ్లిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? ఈ కథలో సరస్వతి (రాధికా శరత్‌కుమార్) పాత్ర ఏమిటి అన్నదే ఈ సినిమా కథ.

ఈ ప్రాపర్ న్యూ ఏజ్ సినిమా ట్రైలర్ లోనే ఈ సినిమాలో అసలు విషయం ఏమిటనేది రివీల్ చేసేసారు. దాంతో ఈ పాయింట్ ని ప్రదీప్ ఎలా ట్రీట్మెంట్ ఇచ్చి, జనాలకు నచ్చేలా తెరకెక్కించారనేదే ముఖ్యం. ఈ సినిమాలో ప్రదీప్ చేసింది మంచి జోక్స్ తో సినిమాను నింపటం. ఎందుకంటే తెలిసున్న కథను చాలా తెలివిగా చెప్పకపోతే దొరికి పోతానని అతనికి తెలుసు. కాబట్టి ఎక్కడా బోర్ కొట్టకుండా మాగ్జిమం కథను చిన్న చిన్న ట్విస్ట్ లతో, చివర్లో ఓ ఎమోషన్ తో ముడిపెట్టి ముగించాడు. ఫేస్బుక్, ట్విట్వర్ వంటి సోషల్ మీడియా యాప్స్ ప్రపంచంలో, ఫోన్ లోకంగా బతుకుతున్న యుత్ లైఫ్ స్టైల్ ని ఈ సినిమా ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేయగలిగింది.
సోషల్ మీడియా ద్వారా మొగ్గ తొడిగిన ప్రేమల్లో ఉండే నిజాయితీని ఈ సినిమా ప్రశ్నిస్తుంది. నమ్మకంతో నిలబడాల్సిన ప్రేమ బంధాలను అనుమానాలతో ఎలా తుంచేసుకుంటున్నారనే విషయం చెప్తున్నారు. నేటి తరం ఎదుర్కొంటున్న అనేక అంశాలతో ఆలోచనాత్మకంగా ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు.

టెక్నికల్ గా చూస్తే.. ఫన్ మూడ్ ని ఎలివేట్ చేస్తూ చాలా మంచి విజువల్స్ ని రాబట్టుకున్నారు. సౌండ్ డిజైన్ కూడా బావుంది. ఎడిటింగ్ కాస్త పదునుగా ఉండాల్సింది. దర్శకుడు ఫన్ కోసం మంచి నేపధ్యాన్ని తీసుకున్నాడు. అయితే దాన్ని ప్రజంట్ చేయడంలో ఒక్కోసారి గీత దాటాడు అనిపిస్తుంది కానీ కాసేపటికే సర్దుకుంటూంటాడు. కాకపోతే ఈ మధ్య వచ్చిన యూత్ సినిమాలతో పోలిస్తే.. లవ్ టుడే కాస్త కొత్తగా అనిపిస్తుంది. రొమాంటిక్ కామెడీ జోనర్‌ని ఇష్టపడే వాళ్లు ఓసారి ఇటు ఓ లుక్కు వేయొచ్చు.
చూడచ్చా?
2K జనరేష్ కు ఇది బాగా నచ్చే చిత్రం. ఓ ఏజ్ దాటిన వాళ్లకు ఇందులో ఏముంది.. నాలుగు జోక్స్.. ఓవర్ యాక్షన్ తప్ప అనిపిస్తుంది.
బ్యానర్: ఎ.జి.ఎస్.ఎంటర్టైన్మెంట్
నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, ఇవానా, యోగిబాబు, సత్యరాజ్, రాధిక తదితరులు
ఛాయాగ్రహణం : దినేష్ పురుషోత్తమన్
సంగీతం: యువన్ శంకర్ రాజా
తెలుగులో రిలీజ్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రదీప్ రంగనాథన్
Run Time: 2h 35m
విడుదల తేదీ: నవంబర్ 25, 2022
Rating:2.75