Home Cinema Review రవితేజ నిర్మించిన ‘మట్టి కుస్తీ’ రివ్యూ & రేటింగ్!

రవితేజ నిర్మించిన ‘మట్టి కుస్తీ’ రివ్యూ & రేటింగ్!

58
0
Reading Time: 3 minutes

రేటింగ్ : 2.25/5

మట్టికుస్తీ అంటే ఇదేదో దంగల్ లేదా సుల్తాన్ టైప్ కథాంశం. గొప్ప స్పోర్ట్స్ డ్రామా చూడబోతున్నాం అని ఉత్సాహపడిపోతే థియేటర్ లో అడ్డంగా కూలపడాల్సి వస్తుంది. ఇదో కామెడీ సినిమా..మొగుడు,పెళ్లం మధ్య జరిగే కుస్తీ లాంటి కథ అని డైరక్టర్ భావం. ఎందుకంటే మట్టీ కుస్తీ అనే పదం మనం అనం..ఎక్కడా వినం. ఈ సినిమా పుణ్యమా అని తెలుగులో ఈ పదం కొత్తగా చేరిందనే చెప్పాలి. తమిళంలో పెట్టిన టైటిల్ కు దగ్గరగా ఉండే పదాలను ఏర్చికూర్చి పెట్టేసినట్లున్నారు. టైటిల్ ది ఏముంది..ఏదొకటి..కథ బాగుంటే కుమ్మేద్దామనే బ్యాచ్ మన తెలుగోళ్లది. అందుకే వారం వారం మనథియేటర్స్ లో సినిమాల కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. వరసపెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలు సైతం స్టైయిట్ ని మించి ఆడేస్తున్నాయి. కాబట్టి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదిగో ఈసారి ఈ సినిమా..రవితేజ అండతో తెలుగులోకి దూకింది. అయితే సినిమా ని కామెడీగా డీల్ చేయాలనే తపన, మెసేజ్ చెప్పాలనే అత్యుత్సాహం తప్పించి ఈ సినిమాలో మరొకటి కనపడదు. కాస్తంత టైట్ గా ఈ సినిమా స్క్రిప్టు చేసుకుంటే బాగుండేది కదా అని సగటు సినిమా వాడు బోలెడు ఆవేదన పడిపోయే సందర్బం ఇది. సినిమా పక్కా ఫార్మెట్ లో సాగిపోతుంది.

సినిమా మొదట్లో హీరో,హీరోయిన్స్ క్యారక్టర్స్ ప‌రిచ‌యం.. పెళ్లి చూపుల, అబ‌ద్ధాలు ఆడి పెళ్లి చేసేయ‌డం… ఇవ‌న్నీ ప్రెడిక్టబుల్ అయినా ఫన్ ని పంచాయి. పెళ్లి త‌ర్వాత భార్య ముందు హీరో ఫోజు కొట్టే సీన్స్, త‌న సవరాన్ని జ‌డ అని న‌మ్మించ‌డానికి కీర్తి ప‌డే క‌ష్టాలు నవ్విస్తాయి. అంతవరకూ బాగుంది. ఇంటర్వెల్ కి ముందు ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో హీరోయిన్ లో అస‌లు కోణం బ‌య‌ట ప‌డ‌టం.. అది చూసి హీరో షాక్ అవ్వడం కూడా ఊహించిందే అయినా నడిచిపోతుంది.. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. అప్పటికీ సెకండ్ హాఫ్ ని కూడా ఎంటర్టైన్మెంట్ గానే డీల్ చేశాడు డైరక్టర్. అయితే భార్యా భ‌ర్తల మ‌ధ్య ఆధిప‌త్య పోరు, ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించ‌డానికి చేసే ప్రయ‌త్నాలు అబ్బ ఎన్ని సినిమాల్లో చూసామని అనిపిస్తుంది. అయితే చివర్లో ఇచ్చిన మెసేజ్ మాత్రం ఆకట్టుకునేలా వుంటుంది. ఇంతకీ ఏంటా కథ, ఆ మెసేజ్ మ్యాటర్ అంటారా…

కేరళకు చెందిన కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ) ఓ రెజ్లర్. బీఎస్సీ కూడా చదివింది. చిన్న జుట్టుతో స్టైలిష్‌గా ఉంటుంది. చెల్లెల్ని ఈవ్ టీజింగ్ చేసిన వాడ్ని రోడ్డు మీద పరుగులు పెట్టించి మరీ కొట్టగల సత్తా ఆమె సొంతం. మరో ప్రక్క ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వీర (విష్ణువిశాల్‌)కి చిన్నప్పుడే అమ్మా,నాన్నా చనిపోయారు. మామయ్య (కరుణాస్‌) పెంచి పెద్ద చేసాడు. . ఎనిమిదో తరగతి వరకే చదువుకున్న అతను ఊర్లో ఏ పనీ చేయకుండా బలాదూర్‌గా తిరుగుతూ ఉంటాడు. వీరకి బాగా ఆస్తిపాస్తులున్నాయి..ఊరి నిండా గొడవలు ఉన్నాయి. అయితే అతనికి తన కాబోయే భార్య మీద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆడపిల్లలు అణిగిమణిగి ఉండాలని, ఎక్కువ చదువుకుంటే సమస్యలు వస్తాయని ఆలోచిస్తూంటాడు.

దాంతో తనకు కాబోయే భార్య తనకంటే తక్కువ చదువుకోవాలని, జుట్టు పొడుగుండాలని వీర కండీషన్స్‌ పెడతాడు. ఈ క్రమంలో అలాంటి పిల్ల దొరక్క అతనికి పెళ్లి కాదు. మరో ప్రక్క రెజ్లర్ కావటంతో కీర్తికి పెళ్లికాదు. ఈ క్రమంలో వీరిద్దిరు ఒకటి అయ్యే అవకాసం వస్తుంది. కీర్తి బాబాయి… ఆంధ్రలోని చిన్ననాటి స్నేహితుడైన వీర మామయ్యని ఓ సందర్భంలో కలుస్తారు. ఈ క్రమంలో పెళ్లి మాటలు వచ్చి..వీరిద్దరి పెయిర్ బాగుంటుదనే నిర్ణయానికి వస్తారు.

కీర్తి తక్కువ చదువుకుందని,నడుము కింద వరకు పొడవాటి జుట్టు ఉంటుందని అబద్దాలు చెప్పి వీర (విష్ణు విశాల్)కు ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే ఓ రోజు ఆమె రెజ్లర్ అనే విషయం బయిటపడుతుంది. పెళ్లి కోసం అబద్దాలు ఆడారనే సంగతి తెలిసిపోతుంది. విడాకులకు వెళ్తారు. అక్కడ నుంచి వీరిద్దరి జీవితంలో ఏమి మార్పులు వచ్చాయి. చివరకు ఏమైంది. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథగా చదివితే ఏమీ అనిపించదు. చిన్న అబద్దం..పెద్ద సమస్య అనిపిస్తుంది. చిన్న అబద్దం ఆడి ఓ జంటను కలిపాను అనుకుంటే అది మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. అయితే ప్రేమ,అనురాగం శాశ్వతమని డైరక్టర్ చెప్పదలగిచారు. ఆ దిసగా కథ నడిపించారు. సినిమా సరదాసరదాగా నడుస్తుంది. ఫన్ బాగానే ఉంటుంది. కానీ ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తుంది. తర్వాత ఏం జరిగుతుందో క్లైమాక్స్ ఏమిటో ఇంటర్వెల్ కే చెప్పేయగలం. అలాంటి స్క్రీన్ ప్లే ఈ సినిమాకు సొంతం. అయితే ఉన్నంతలో మాస్ అంశాలతో కమర్షియల్ పంథాలో రూపొందించడం ఈ సినిమాకు కలిసివచ్చింది.

టెక్నికల్ గా చూస్తే… డైరక్షన్ ఛల్తా హై అనిపిస్తుంది. ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమాలా కావాలని డిజైన్ చేసారనిపిస్తుంది. ఇక సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ విసొంపైన పాటలు ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ చెప్పుకోదగ్గ స్దాయిలో ఉన్నాయి.

నటీనటుల్లో …. రానా ‘అరణ్య’లో ప్రధాన పాత్రలో కనిపించిన విష్ణు విశాల్… ఆ తర్వాత ‘ఎఫ్ఐఆర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ‘మట్టి కుస్తీ’ సినిమాతో తెలుగులోకి మరోసారి వచ్చారు. ఐశ్వర్య లక్ష్మి నటిగా ఎప్పుడూ ఎక్కువ మార్కులు సంపాదించుకుంటోంది. తన పెయిర్ హీరోలను డామినేట్ చేయగలగటం ఆమె సొంతం. అలాగే ఈ ప్రాజక్టు కోసం ఆమె పడిన కష్టం, కసరత్తులు మెచ్చుకోబుద్ది వేస్తాయి. శత్రు, అజయ్ నెగిటివ్ రోల్స్ లో అలరించారు. “డాక్టర్” ఫేమ్ రెడ్ కింగ్స్లే కామెడీ టైమింగ్ చక్కగా నవ్విస్తుంది.

చూడచ్చా

ఓ ఫన్, ఎంటర్టైనర్ గా చూస్తే .. ఓ వీకెండ్ కాలక్షేపానికి ఢోకా లేదనిపిస్తుంది.

నటీనటులు : విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజా రవి, అజయ్, శత్రు, మునీష్ కాంత్, కాళీ వెంకట్, రిడిన్ కింగ్ స్లే, హరీష్ పేరడీ తదితరులు
ఛాయాగ్రహణం : రిచర్డ్ ఎం నాథన్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
నిర్మాతలు : రవితేజ, విష్ణు విశాల్
Runtime : 2 hours 24 minutes.
రచన, దర్శకత్వం : చెల్లా అయ్యావు
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022

Previous articleఆది కి వార్నింగ్ ఇచ్చింది ఎవరు?
Next articleAyurvedic drug Fifatrol effective in treating respiratory infections: Study