Home Cinema Review విజయ్ ‘వారసుడు’ రివ్యూ

విజయ్ ‘వారసుడు’ రివ్యూ

12
0
Reading Time: 4 minutes

ఉమ్మడి కుటుంబంగా అందరూ కలిసి ఉన్నప్పుడు…ఉండాలనుకున్నప్పుడు ఏ లోపాలు లేకుండా ఎవరూ ఉండరు, వాటిని అర్థం చేసుకుని సర్దుకుంటూ జీవితం గడపితేనే అసలైన ఆనందం. వింటానికి ఇది గొప్ప మెసేజే. విజయ్ వారసుడు అదే మోసుకు వచ్చింది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయని అడిగితే చెప్పేలేం కానీ …ఉంటే కనుక…వాళ్లంతా సర్దుకుపోదాం రండి అని కలిసి మెలిసి, కభి ఖుషీ కభీ గామ్ తరహాలో పాటలు పాడుకుంటూ ఉండాలి. అంతవరకూ బాగానే ఉంది. మెసేజ్ లు కోసం సినిమాలకు వెళ్ళం కాబట్టి వాళ్లే చెప్పినా సర్దుకుపోతాం. అయితే ఈ మెసేజ్ ని స్టార్ హీరోతో చేస్తూ కావాల్సిన కమర్షియల్ హంగులన్నీ ఇందులోనూ జోడించారు. అయితే ఈ మెసేజ్ ఎంత పాతదో…దాన్ని మోసుకొచ్చే స్టోరీ లైన్ అత్యంత పురాతనమైది కావటంతో ….కొన్ని సార్లు టీవీ సీరియల్స్ చూస్తున్నట్లు, మరికొన్ని సార్లు విజయ్ పాత సినిమాలు చూస్తున్నట్లు అనిపిస్తుంది. సినిమాలో ఎక్కువ శాతం సీన్లు గతంలో చూసినట్టే అనిపిస్తాయి.

కొన్ని సార్లు వెంకటేష్ లక్ష్మి గుర్తుకువస్తే మరోసారి జగపతిబాబు ఆహా ..నన్ను మర్చిపోలేదా అంటుంది. మహేష్ శ్రీమంతుడు, చిరంజీవి అన్నయ్య, గౌతమ్ ఎస్ఎస్సి సీన్స్ క్యూ కట్టి ఒక్కొక్కటిగా పలకరించుకుంటూ వెళ్తాయి. అల వైకుంఠపురములో మొదలుకుని అత్తారింటికి దారేది, డార్లింగ్ లాంటి అనేక సినిమాలు వరస పెట్టి కళ్లదెరుగా కనపడుతాయి.సరే సరే…మీకు జ్ఞాపక శక్తి ఎక్కువని ఒప్పుకుంటాం…అవన్ని మర్చిపో అని మనకి మనమే సెల్ప్ హిప్నాటైజడ్ చేసుకుంటే అప్పుడు మనశ్సాంతిగా వింటేజ్ విజయ్ ని చూస్తాము. అయితే ఇంత కష్టిపడినా డైరక్టర్ …ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయటంలో క్యారక్టర్స్ ఆర్క్ ని ప్రెజెంట్ చేయటంలో తడపడటం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ శాతం కథ ఓ పెద్ద భవంతిలో అదే హీరో ఇంట్లో జరుగుతున్నప్పుడు మనకు ఓ మెగా టీవి సీరియల్ చూసిన ఫీలింగ్ వస్తే అది వాళ్ల తప్పు కాదు. ఇక విజయ్ హీరోగా అనుకున్నా ఈ చిత్రంలో తెలుగు నటీనటులే ఉంటారు. డైరక్టర్ ,నిర్మాత తెలుగువారే. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న మన పుష్ప ప్రక్కన చేసిన పిల్లేఅనిపిస్తుంది. ఇక జయసుధ, ప్రకాష్ రాజ్ వంటి వారు ఉండనే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి అంటే…

రాజేంద్ర (శరత్ కుమార్) ఓ పెద్ద బిజినెస్ టైకాన్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్) వీళ్లలో ఎవరికి అప్పచెప్పాలనే ఆలోచనలో ఉంటాడు. విజయ్ తన తండ్రి విధానాలు నచ్చక, అభిప్రాయాలు భేదాలు వచ్చి ,విభేధించి,తనకు నచ్చినట్లు బ్రతుకుతానంటూ ఇంటినుంచి బయిటకు వెళ్లిపోతాడు. జై,అజయ్ ల కన్ను మాత్రం ఈ చైర్మన్ కుర్చీపైనే ఉండి తండ్రిని అంటిపెట్టుకుంటారు. మరో ప్రక్క ఎప్పుడు ఇలాంటి సిట్యువేషన్ వస్తుందా అని వ్యాపార ప్రత్యర్ది జయ్ ప్రకాష్(ప్రకాష్ రాజ్) ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో రాజేంద్రన్ తనకు అనారోగ్యం అనే విషయం తెలసి టైమ్ అయ్యిపోయిందని గ్రహిస్తాడు. తన సామ్రాజ్యానికి అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. చిన్న కొడుకుకి కబురు వెళ్తుంది. ఏడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న విజయ్…తన మంచితనం, కుటుంబం పట్ల ప్రేమ, బిజినెస్ తెలివితో ఎలా తనే వారసుడు అనిపించుకున్నాడు. తన అన్నలలో ఎలాంటి మార్పు తెచ్చాడు. ప్రత్యర్దిగా ఉండి కుట్ర చేస్తున్న జయప్రకాష్ కి ఎలా బుద్ది చెప్పాడు. బీటలు తీసిన తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు..రష్మికతో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

పై కథ చదవగానే ప్రెషెనెస్ అనే పదాన్ని దూరంగా పెట్టి రొటీన్ రాజాలా రాసుకున్న కథ ఇదని అర్దమైపోతుంది. కానీ సీన్స్ లో వచ్చి పోయే మసాలాలు, ఫైట్లు, ఆహ్లాదపరిచే పాటలు అన్నీ ఇక్కడ రిపీట్ అవటంతో సేద తీరుతాం. తమిళ వాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాసం ఉంది. ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ ఏమిటి అంటే విజయ్ పాత బ్లాక్ బస్టర్ సినిమాలను గుర్తు చేస్తూ వింటేజ్ విజయ్ ని చూపిస్తూ…ఆ మెమెరీస్ ని తట్టి లేపే కొన్ని సీన్స్ ని ఎంచుకోవటమే. కెరీర్ ప్రారంభంలో విజయ్ చేసిన సినిమాల్లో హైలెట్స్ ఇక్కడ ప్లే అవుతూంటాయి. అవి ఖచ్చితంగా విజయ్ ఫ్యాన్స్ కు పండగ చేసేవే.

టెక్నికల్ గా ….చూస్తే…దర్శకుడుగా వంశీ పైడిపల్లి టార్గెట్ …విజయ్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా హిట్ కొట్టాలనే చేసిన డిజైన్ కనిపిస్తుంది. తమన్ సంగీతంలో రంజితమే ఒకటే మంచి హుషారుగా సాగుతుంది. మిగిలినవి సోసోనే. మిగతా సాంగ్స్ పర్వాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో తన మార్క్ చూపించారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ, యాక్షన్ ఎపిసోడ్స్‌లో మ్యూజిక్‌కి ప్రశంసలు దక్కాల్సిందే. సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. పాటల్లో , క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్లలో కెమెరాపనితనాన్ని చూపించారు. ఇక రష్మిక షోను మరింత అందంగా ఆకర్షణీయంగా చూపించి ప్రేక్షకులు చూపుతిప్పుకోకుండా చూపించారు. ఎడిటింగ్ వర్క్ బాగుంది. దిల్ రాజు బాగా ఖర్చు పెట్టారని అర్దమవుతుంది.

నటీనటుల్లో … వయస్సుమీద పడుతున్నా తగ్గేదేలే అన్నట్లుగా… స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా విజయ్ బాగున్నాడు ఇది పూర్తిగా విజయ్ భుజాలమీద మోసిన చిత్రం. అదిరిపోయే ఫన్నీ వన్ లైనర్స్ తో టెర్రపిక్ గా తెరపై విజయ్ చెలరేగిపోయాడు. రష్మిక గురించి పెద్దగా చెప్పుకోనేది ఏమీలేదు . ప్రకాష్ రాజ్, జయసుధ వంటి వారు తమదైన నటన చేసుకుంటూ వెళ్లిపోయారు. విలన్ ట్రాక్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎస్ .జె సూర్య కనపడేది కాసేపే అయినా హైలెట్ గా నిలిచాడు.

చూడచ్చా
పాత,కొత్త ఏంటి…సినిమా అంటే సినిమానే అని భావించే వాళ్లకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది.

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా
నటీనటులు : విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్
డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్
ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్
మేకప్: నాగరాజు
కాస్ట్యూమ్స్: దీపాలి నూర్
పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న
వీఎఫ్ఎక్స్: యుగంధర్
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌
Run Time: 2h 45m
సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి

Rating: 2.5

Previous articleSix killed in shooting in California
Next articleBelarus, Russia start joint air force drill