తెలుగులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరో సుధీర్‌వర్మ వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ షాక్ కు గురి చేసింది. సోమవారం విశాఖపట్నంలో ఈ సంఘటన జరిగింది. అయితే అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మాత్రం తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. ఈ మేరకు పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.
2013 సంవత్సరంలో కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సెకండ్ హ్యాండ్ సినిమా సుధీర్ వర్మకు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో సంతోష్ అనే పేరున్న ఫొటోగ్రాఫర్‌గా సుధీర్ వర్మ నటించాడు. ఈ సినిమాతోనే అతడు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వర ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన కుందనపు బొమ్మ సినిమాలో ఒక హీరోగా నటించాడు సుధీర్‌వర్మ. 2016 సంవత్సరంలో ఈ సినిమా రిలీజైంది. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని తెలుగు సినిమాల్లో సుధీర్ వర్మ కీలక పాత్రలు పోషించాడు.
చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించిన షూటౌట్ ఎట్ ఆలేర్ అనే వెబ్‌సిరీస్‌లో కూడా సుధీర్‌వర్మ నటించాడు. ఇదే అతడు నటించిన చివరి ప్రాజెక్ట్ . సుధీర్ వర్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో సుధాకర్ కొమాకుల ఎమోషనల్ అయ్యాడు. నువ్వు లేవు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. 2016లో వచ్చిన కుందనపు బొమ్మ సినిమాలో సుధీర్‌వర్మతో పాటు సుధాకర్ కొమాకుల మరో హీరోగా నటించాడు.