వెంకటేష్ తనకు ఇన్నాళ్లు అండగా నిలిచిన ఫ్యామిలీ ఆడియన్స్ టీవిలకు వెళ్లిపోయారని తెలుసుకున్నట్లున్నారు. అందుకే తను కూడా టర్న్ అయ్యి వెబ్ సీరిస్ చేసారు. అది కూడా చాలా బోల్డ్ గా రెగ్యులర్ సీరిస్ లకు భిన్నగా ఓ అడల్డ్ సీరిస్ లాంటిది ఓకే చేసారు. అయితే హాట్ సీన్స్, స్పెసీ ఎలివేషన్స్, కొన్ని బూతులు ఉన్నా బలమైన కంటెంట్ ఉండటం, చూసే ఆడియన్ ని టెన్స్ కు గురి చేసే ట్విస్ట్ లు ఉండటం కలిసొచ్చింది. అయితే స్లో నేరేషన్, చిన్న పాయింట్ చుట్టూ ఎక్కువ క్యారక్టర్స్, సబ్ ప్లాట్స్ అల్లుకుని ఉండటం కొంత విసుగిస్తుంది. కథలోకి వెళ్లకండా ఏమిటి నస అనిపిస్తుంది. అసలు రెండు ఎపిసోడ్స్ దాకా ఏం జరుగుతోందో అర్దం కాదు. ఒక్కసారి కథలోకి జర్నీ చేసాకే ఇక వదల బుద్ది కాదు. ఏదైమైనా క్లైమాక్స్ రెండు ఎపిసోడ్స్ లో ఉన్నంత ఉత్కంఠ మిగతా ఎపిసోడ్స్ లో కూడా ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఒక సెన్స్ సీన్ అయినా పెట్టడం, గే సీన్స్, , క్యారక్టర్స్ మధ్య అక్రమ సంబంధాలు, పలకటానికి, చెప్పుకోవటానిక ఇబ్బందిగా అనిపించే పదాలు ఈ సీరిస్ లో అడగడుగునా తగులుతాయి. ఇవన్ని చాలదన్నట్లు ఓ చోట హీరో వెంకటేష్ తన అక్రమ సంబంధాల గురించి కన్న కొడుకులతోనే చెప్పడం జుగుప్సగా ఉంటుంది. వాళ్లను కూడా ‘మందు కొట్టండి, అక్రమ సంబంధాలు పెట్టుకోండి’ అని చెప్పటం పరాకాష్ట. ఈ కాలం సీరిస్ లు ఇలాగే ఉంటాయంటే చేసేదేమీ లేదు.ఇంతకీ కథేమిటంటే…

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెలబ్రెటీల సమస్యలను ఒంటి చేత్తో పరిష్కరిస్తూంటాడు రానా నాయుడు (రానా). అందుకోసం బోలెడు ఫీజ్ వసూలు చేస్తూ బ్రహ్మాండంగా బ్రతికేస్తూంటాడు. అలా అందరి సమస్యలనూ చిటికెలో సాల్వ్ చేసే అతనికి తండ్రి నాగా నాయుడు (వెంకటేశ్) పెద్ద సమస్య. అతన్ని గతంలో ఓ కేసులో ఇరికించి జైలుకు పంపాడు. పదిహేనేళ్లు తర్వాత నాగా నాయుడు జైలు నుంచి బయిటకు వచ్చి డైరక్ట్ గా కొడుకు దగ్గరకు వస్తాడు. అక్కడ నుంచి రానా నాయుడు జీవితం, కుటుంబం, ప్రొపిషనల్ లైఫ్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అవి ఏమిటి..అసలు తండ్రినే జైలుకు పంపటం వెనక రానా నాయుడు ఆలోచన ఏమిటి…అలాగే సూర్య (ఆశీష్ విద్యార్థి) అనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ కారణంగా రానా నాయుడికి ఎదురైన సమస్యను నాగనాయుడు ఎలా పరిష్కరించాడు? ఆ గ్యాంగ్ స్టర్ బారి నుంచి తన కుటుంబాన్ని రానా నాయుడు ఎలా కాపాడుకున్నాడు …చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే వెబ్‌సిరీస్ చూడాల్సిందే!

ఈ సీరిస్ లో చెప్పుకోవాల్సింది…కొడుకు రానానే తనను జైలు పాలు చేశాడని గ్రహించిన నాగ అతడిని ఎదుర్కోనడానికి ఎలాంటి ఎత్తులువేసాడు..వాటిని కొడుకు ఎలా చిత్తు చేసాడు … ఆ క్రమంలో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు. తన ప్రొపిషనల్ లైఫ్ కు దెబ్బ తగలకుండా ఏం చేసాడు అనేది ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేసాడు. ఇక తండ్రి నాగను కొడుకు రానా నాయుడు ఎందుకు ద్వేషిస్తున్నాడో చివరి ఎపిసోడ్‌లో చూపించారు. ఆ తర్వాత కొడుకుకు ఎదురయ్యే సమస్యను నాగ పరిష్కరించే సీన్‌తో సిరీస్‌ను ఎండ్ చేసి రెగ్యులర్ ముగింపు ఇచ్చారు. ఓ రకంగా ఈ సిరీస్ చాలా వరకు బోర్ కొట్టించింది. చాలా చోట్ల విషయం లేకుండా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. తండ్రిని రానానాయుడు ద్వేషించడానికి గల కారణం ఏదో చెప్తాడు అనుకుంటే అందులోనూ డెప్త్ లేదు. రానా నాయుడు సోదరులు పాత్రల్లోని ఎమోషన్స్ సరిగా వర్కవుట్ కాలేదు. ఏదో పెద్ద హీరోలు ఇద్దరు కలిపి చేసిన సీరిస్ గా చూడాలి తప్పించి అంతకు మించి ఏమీ లేదు.

హైలెట్స్:
రానా పాత్ర
వెంకటేష్ ఫెరఫార్మెన్స్
కొత్తగా అనిపించే ప్లాట్
మైనస్ లు:
స్లో నరేషన్
చాలా చోట్ల వినిపించే బూతులు
రెగ్యులర్ వ్యూయర్స్ కు డైజస్ట్ కాని కథ
చూడచ్చా?
చూడవచ్చు…కానీ, వెంకటేష్ ఉన్నాడు కదా అని ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ అయితే కాదు.
నటీనటులు: రానా, వెంకటేశ్, సుచిత్ర పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్విన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య మేనన్ తదితరులు;
సంగీతం: సంగీత్-సిద్ధార్థ్;
సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి;
ఎడిటింగ్: నినద్ ఖనోల్కర్, మానన్ అశ్విన్ మెహతా;
రచన: కర్మన్య అహుజ, అన్నే మోదీ, బీవీఎస్ రవి, వైభవ్ విశాల్, కరణ్ అన్షుమన్;
స్క్రీన్‌ప్లే: బీవీఎస్ రవి;
నిర్మాత: పెరల్ గిల్, సుందర్ అరోన్, సుమిత్ శుక్లా;
దర్శకత్వం: సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్;
స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్: నెట్‌ఫ్లిక్స్
Rating:2.75