నందమూరి తారకరత్న నారా లోకేష్ పాద యాత్ర ప్రారంభం రోజు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు ప్రస్తుతం నారాయణ హృదయాలయ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఇవాళ బెంగళూరు వెళ్లిన ఆయన.. ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించారు.. వైద్యులను అడిగి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు..
అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.. 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన మెదడులో పైభాగం దెబ్బతింది.. దానివలన మెదడులో నీరు చేరి మెదడు వాచినట్టు తెలిపారు.. అయితే, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు చెప్పినట్టు సాయిరెడ్డి వివరించారు.
మరోవైపు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విజయసాయిరెడ్డి.. బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నకు అన్ని వైద్యసదుపాయాలు కల్పించారని తెలిపిన ఆయన.. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.. ఇక, మెదడుపై భాగం దెబ్బతినడంతో కొన్ని అవయవాలు కొంత యాక్టీవ్ గా పనిచేయడంలేదని డాక్టర్లు తెలిపారని.. గుండె బాగానే పనిచేస్తుందని.. తారకరత్న త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు విజయసాయిరెడ్డి. కాగా, తారకరత్నకు విజయసాయిరెడ్డి స్వయానా మామ అవుతారనే విషయం విదితమే.
ఇక విజయసాయిరెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కూతురు అలేఖ్య. ఈమె సినిమా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసేవారు. తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొంతకాలం ప్రేమించుకున్న వీరు హైదరాబాద్‌లోని సంఘీ గుడిలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి అతి కొద్ది మంది బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు.