విఘ్నాలు తొలగించే ఈ విఘ్నేశ్వరుడి ముందు గుంజీలు కూడా తీస్తుంటామనే సంగతి తెలసిందే.అయితే అలా ఎందుకు చేస్తామో మాత్రం ఎవరికీ తెలియదు. మనకు చాలా సార్లు అలా ఎందుకు చేయాలనే అనుమానం వచ్చినా… సమాధానం చెప్పేవారు లేక ఆగిపోతూంటాం.అయితే వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీయాలి, గణేషుడికి భక్తులు గుంజీలు తీయడం ఇష్టమా అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కైలాసనాధుని కొలువున వుండే ప్రమదగణాలకు అధిపతి పార్వతీ పుత్ర వినాయకుడు. విఘ్నరాజ తత్త్వం గురించి శివపురాణాలలో , శైవాగమాలలో వర్ణించబడింది. గణేశుడు ముమూర్తుల అంశతో నిండినవాడు. సకల దేవతలచే పూజించ బడుతున్నవాడు. గణనాధునికి మించిన అధినాయకుడు వేరొకడులేడు. ప్రధమ పూజలందుకునే దైవం వినాయకుడు.
ఈ క్రమంలో మన పూర్వీకులు వినాయకుని పూజలో ఆచారంగా వస్తున్న గుంజీలు తీయడం గురించి తెలిపారు. ఎన్నో శతాబ్దాల క్రితమే మన ప్రాచీన మునులు , యోగాభ్యాసకులు ఆధ్యాత్మిక తత్త్వంలో ఒక అంశంగా ముందుగా వినాయకుని సన్నిధిలో గుంజీలు తీసి ప్రణమిల్లడమనే సంప్రదాయాన్ని ఏర్పర్చారు.
వినాయకుని ముందు గుంజీలు తీసే ఆచార ప్రప్రధమంగా శ్రీ మహావిష్ణువు తో ప్రారంభమైనది అని చెప్తారు. దీనికొక పౌరాణిక గాధ వున్నది.
శ్రీహరి ఒకానొకప్పుడు కైలాసానికి వెళ్లాడు. మర్యాదలన్నీ అయిన తర్వాత శివ కేశవులిద్దరూ ముచ్చట్లాడుకుంటూ కూర్చున్నారు.ఇంతలో గణపతి అక్కడకు వచ్చాడు. శ్రీ హరి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని చూశాడు.అది విఘ్నేశ్వరుడికి విచిత్రంగా కనిపించింది. చాలా బాగా నచ్చింది.వెంటనే దాన్ని లాక్కొని నోట్లో పెట్టేసుకున్నాడు .నోరు బిగించుకొని కూర్చున్నాడు. పార్వతీదేవితో పాటు సకల దేవతలకు గారాబుపట్టియైన వినాయకుని నోటి నుండి ఆ చక్రాన్ని తిరిగి తీయడమనేది ఒక జటిలసమస్య. పైగా వినాయకుడు అత్యంత బలశాలి. వినాయకుని బెదిరించి ,ఎదిరించి చక్రాన్ని తిరిగి పొందడం అంత సులభసాధ్యం కాదు. లాలించి, బుజ్జగించి, యుక్తితోనే చక్రాయుధాన్ని వినాయకుని నోటినుండి రప్పించాలి.
అటువంటి పరిస్థితులలో మహావిష్ణువు ఒక యుక్తిని పన్నాడు. వినాయకుడు బాలకుడైనందున అతనిని కవ్వించి , పకపక నోరు తెరిచి నవ్వేలా చేయడానికి మహావిష్ణువు తన నాలుగు హస్తాలతో తన చెవులను పట్టుకొని క్రిందికి కూర్చుంటూ పైకి లేస్తూ అంగ ప్రదర్శన చేశాడు. . ఈ విచిత్ర నటన చూసిన వినాయకుడు పడీ పడీ నవ్వాడు. అలా గట్టిగా నోరు తెరచి నవ్వగానే నోటి నుండి చక్రాయుధం వెలుపలకు వచ్చిపడింది.
ఏ బల ప్రయోగం ఉపయోగించకుండా మహావిష్ణువు తన చక్రాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటినుండి వినాయకుని ప్రసన్నం చేసుకోవడానికి గుంజీలు తీసే ఆచారం వచ్చిందని పురాణ కధనం.